అనిత నియోజకవర్గం మార్పు.. పెద్దాయనకు మళ్లీ పిలుపు.. చంద్రబాబు కీలక నిర్ణయం

టీడీపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు అధినేత చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలోనే మోగబోతుండటంతో.. జిల్లాలవారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల తర్వాత కొందరు నేతలు పక్క పార్టీల్లోకి వెళ్లిపోవడంతో.. అక్కడ కేడర్ చెదిరిపోకుండా చర్యలు ప్రారంభించారు. స్థానిక నేతలతో చర్చించి నియోజకవర్గ ఇంఛార్జ్‌లను నియమించే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఖాళీలు భర్తీ చేసిన బాబు.. తాజాగా మరో రెండు నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించారు.



టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు నియోజకవర్గాన్ని మార్చేసారు చంద్రబాబు. ఆమెకు తిరిగి విశాఖ జిల్లా పాయకరావుపేట బాధ్యతల్ని అప్పగించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్‌గా మాకినేని పెద రత్తయ్యకు బాధ్యతలు ఇచ్చారు. అనిత 2014 ఎన్నికల్లో అనిత పాయకరావుపేట నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం నియోజకవర్గాన్ని మార్చేశారు.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. పాయకరావుపేటలో బంగారయ్యకు సీటు కేటాయించగా.. ఆయనకు ఓటమి తప్పలేదు. ఇప్పుడు మళ్లీ స్థానిక పరిస్థితులు మారిపోవడంతో అనితకు బాధ్యతలు అప్పగించారు.